బలవంతంగా తన మెడలో తాళి కట్టి పెళ్లిచేసుకున్నాడని.. తర్వాత బెదిరించి ఆరు నెలలుగా కాపురం చేస్తున్నాడని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఈ బాధ నుంచి విముక్తి కల్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అంబర్‌పేట్‌కు చెందిన అనిల్‌(24) అనే యువకుడు గత అయిదు సంవత్సరాల నుంచి శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి(19)ని ప్రేమిస్తున్నాడు. ఆరు నెలల క్రితం గుడికి వెళ్ళాలని అనిల్‌ ఆ యువతిని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళాడు.

ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ఓ చెట్టు కింద ఆమె మెడలో తాళికట్టాడు. మరొకరితో పెళ్ళి కాకుండా చేశాడని తనతో రాకపోతే బతుకు ఆగమవుతుందంటూ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆ  యువకుడితో పాటు బాధిత యువతి అంబర్‌పేటకు వెళ్ళి కాపురం పెట్టింది. అయితే.. రోజూ బెదిరించి మరీ కాపురం చేసేవాడని యువతి  పేర్కొంది. 

ఈ మధ్య మద్యం సేవించి ఇంటికి వచ్చి మరింత వేధించసాగాడని యువతి పేర్కొంది. కాగా.. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త అనిల్ ని అరెస్టు చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.