మేనరికం అనుకుంటే.. పెళ్లైన ఆరునెలలనుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య.. !!
అదనపు కట్నం వేధింపులు ఓ గర్బిణి ఆత్మహత్యకు కారణమయ్యాయి. 15 నెలల చిన్నారిని తల్లికి దూరం చేశాయి. తల్లితండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చాయి.
అదనపు కట్నం వేధింపులు ఓ గర్బిణి ఆత్మహత్యకు కారణమయ్యాయి. 15 నెలల చిన్నారిని తల్లికి దూరం చేశాయి. తల్లితండ్రులకు కడుపుశోకాన్ని మిగిల్చాయి.
కరీనంనగర్ జిల్లా, వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అదనపు వరకట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధించడంతో ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.
వీణవంక ఎస్సై కిరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చల్లూరుకు చెందిన బొంగోని వీరస్వామి, విజయ దంపతులకు కుమార్తె అనూష అలియాస్ కావ్య, కుమారుడు హరీష్ ఉన్నారు.
కావ్యను ఇదే గ్రామానికి చెందిన వరుసకు మేనబావ అయిన తీగల పరమేశ్ కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ. 15 లక్షల నగదుతో పాటు బైక్, ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు.
వీరికి లోకేష్ అనే 15 నెలలు బాబు ఉన్నాడు. ప్రస్తుతం కావ్య మళ్లీ గర్బవతి. 5 నెలలు నిండాయి. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి.
ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు పెళ్లైన 6 నెలలైనా గడవక ముందే భర్త పరమేశ్, అత్త భూలక్ష్మి, మామ పర్శరాములు, బావ నాగరాజు, తోటి కోడలు సంధ్య, మరిది రాము నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి.
మరో రూ. 5 లక్షలు అదనపు కట్నం తేవాలని ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. అప్పట్లోనే కావ్య ఈ విషయాన్ని పుట్టింటివాళ్లకు చెప్పింది. దీంతో వారు పలుమార్లు ఇరువర్గాల మధ్య పంచాయితీలు కూడా జరిగాయి. అయితే దీంతో వేధింపులు తగ్గకపోగా.. ఇంకా ఎక్కువయ్యాయి.
నిత్యం ఇంట్లో అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతుండటంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆదివారం రాత్రి అత్తింట్లోనే చున్నీతో ఉరేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
తహసీల్దార్ కనకయ్య కావ్య మృతదేహానికి సోమవారం పంచనామా నిర్వహించారు. హుజూరాబాద్ ఏసీసీ సుందరగిరి శ్రీనివాసరావు, జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్సై కిరణ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని, కావ్య మృతదేహాన్ని పరిశీలించారు.
అదనపు వరకట్నం కోసం వేదింపులకు పాల్పడి తన కూతురు ఆత్మహత్యకు కారణమైన అత్తింటి వారిమీద మృతురాలి తండ్రి వీరస్వామి కేసు పెట్టాడు. ఆయన ఫిర్యాదు మేరకు నిందితులు ఆరుగురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.