ఆమె ఓ అనాథ. నా అనే వాళ్లు ఎవరూ లేరు. అనాథ శరణాలయంలో ఉంటూ.. చదువుకుంది. ఈ క్రమంలో తనతోపాటు కలిసి చదువుకున్న ఓ యువకుడిని ప్రేమించింది. అతని ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే... ఓ చిన్న పాటి గొడవ వాళ్లని దూరం చేసింది. ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదిలిపెట్టారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన రియాశర్మ కొంతకాలంగా తనతోపాటు చదివిన కళ్యాణ్‌రెడ్డి అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. అతడి కుటుంబ సభ్యులు నగరంలోని సుభా్‌షనగర్‌లో ఉంటున్నారు. స్విగ్గీలో పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ నైట్‌ డ్యూటీ అని చెప్పి యువతి వద్దకు వెళ్తున్నాడు. ఈనెల 4వ తేదీన ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో క్షణికావేశానికి గురైన అతడు ఇంట్లో ఉరేసుకున్నాడు. 

అతడి మృతిని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆమెను కూకట్‌పల్లిలోని స్వాధర్‌ హోంకు తరలించారు. రియా మానసిక పరిస్థితి చూసి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. వాళ్లు ఆమెను మళ్లీ ఆమె ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయారు. కాగా... తన ప్రియుడు చనిపోవడాన్ని తట్టుకోలేక పోయిన రియాశర్మ... తాను చనిపోతున్నానంటూ తెలిసిన స్నేహితుడికి మెసేజ్ పెట్టింది. అనంతరం వేరే హాస్టల్ జాయిన్ అయ్యి... అక్కడ ఆత్మహత్య చేసుకుంది. 

రియాశర్మ ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆమె స్నేహితుడు ముందుగానే పోలీసులను హెచ్చరించినా వారు స్పందించలేదు. పోలీసులు ముందే రియాక్ట్ అయ్యి ఉంటే... ఆమెను కాపాడేవారనే వాదనలు వినపడుతున్నాయి.