వివాహేతర సంబంధం.. ఓ మహిళకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రస్తుతం ఆమె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నారాయణపేట రూరల్ మండలం తిర్మలాపూర్ కి చెందిన కొండప్పకు ఇరవై ఏళ్ల క్రితం కొండాపూర్‌ గ్రామానికి చెందిన చెన్నమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా.. చెన్నమ్మ కూలిపనులకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన శేఖర్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ నెల 2న ఇద్దరూ కలిసి ఇంట్లో ఉండటాన్ని చూసిన చుట్టుపక్కల వారు గట్టిగా మందలించారు. మరునాడు సాయంత్రం బజారులో నడుచుకుంటూ వెళ్తున్న చెన్నమ్మను శేఖర్‌ లాక్కొని వెళ్లి తన ఇంట్లో బంధించాడు.

ఈ క్రమంలో గ్రామస్తులు వచ్చి ఆమెను విడిపించి తీసుకువెళ్లే క్రమంలో గొడవ చోటుచేసుకుంది. దీనిని మనుసులో ఉంచుకుని అదే రోజు రాత్రి కొండప్ప కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో నిద్రించగా.. రాత్రి ఒంటిగంట సమయంలో శేఖర్‌ తన మిత్రులతో కలిసి వచ్చి చెన్నమ్మపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. కుటుంబసభ్యులుు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 

50శాతంపైగా గాయాలు అవ్వడంతో.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.