మూత్ర విసర్జన చేస్తుండగా యువకుడి ఫొటోలు తీసిన మహిళ.. తట్టుకోలేక అతను చేసిన పని...
యువకుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఫొటోలు తీసిన ఓ మహిళ అతనిమీద పంచాయితీ పెట్టించింది. దీంతో అవమానం తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

కామారెడ్డి : కామారెడ్డిలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన మీద చేసిన తప్పుడు ఆరోపణలు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తను మూత్రవిసర్జన చేస్తుండగా ఫోటోలు తీసిన ఆ మహిళ.. తనను వేధిస్తున్నాడు అంటూ భర్తకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడి ఫోటోలను చూపించింది. దీంతో అతను పంచాయతీ పెట్టించాడు. అది తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అమరావతి గ్రామానికి చెందిన మేతరి ప్రమోద్ (18) బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి కారణం అతడు బహిరంగ మూత్ర విసర్జన చేయడమే. ఈ నెల నాలుగవ తేదీన తన ఇంటికి కొద్ది దూరంలో ప్రమోద్ మూత్ర విసర్జన చేశాడు. సమీపంలో ఉండే ఓ మహిళ ఇది గమనించి.. తన సెల్ఫోన్లో ప్రమోద్ ఫోటోలు తీసింది.
సీఎం సారూ... మా కుటుంబాలను ఆదుకొండి..: మహిళా హోంగార్డు ఆవేదన
ఆ ఫోటోలను తన భర్తకు చూపించింది. రోజూ తనను చూస్తూ, తన ఎదుటే మూత్రవిసర్జన చేస్తున్నాడంటూ ఆరోపించింది. దీంతో కోపానికి వచ్చిన ఆ భర్త కులపెద్దలతో పంచాయతీ పెట్టించాడు. ఆ పంచాయతీలో ప్రమోద్ తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని తెలిపాడు. వర్షం పడుతుండడంతోనే అక్కడ మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ప్రమోద్ చెప్పేది వినకుండా కుల పెద్దలు కూడా తీవ్రంగా మందలించారు.
దీంతో ప్రమోద్ మనస్థాపానికి గురయ్యాడు. ఆర్మూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్ మీద బయలుదేరాడు. అలా వెళ్ళిన ప్రమోద్ ఆర్మూరు శివారులోని అటవీ ప్రాంతానికి చేరుకుని, అక్కడ ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాడు. స్నేహితులకు ఫోన్ చేసి తాను చచ్చిపోతున్నానంటూ నిప్పంటించుకున్నాడు. వెంటనే కంగారుపడ్డ ప్రమోద్ స్నేహితులు అతని కుటుంబ సభ్యులకు విషయం తెలిపి ఘటనా స్థలానికి వెళ్లారు.
వారు అక్కడికి వెళ్లేసరికి ప్రమోద్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. అతడిని అక్కడి నుంచి వెంటనే అంబులెన్స్ లో ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ప్రమోద మృతి చెందాడు. ప్రమోద్ కి ఇద్దరు అన్నలు ఉన్నారు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి అన్నలతో కలిసి ఉంటున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న ప్రమోద్ ప్లంబర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఆర్మూర్ సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, కేసును మాక్లూరుకు బదిలీ చేస్తున్నామని తెలిపారు.