Asianet News TeluguAsianet News Telugu

అత్త క్షుద్రపూజలు.. కొడుకుతో కలిసి కోడలిని చంపి, మృతదేహంపై యాసిడ్ పోసి.. ఆత్మహత్యగా చిత్రీకరణ...

భూదాన్ పోచంపల్లి మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అనారోగ్యంతో ఉన్న భార్యను హత్య చేసి, యాసిడ్ పోసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు భర్త, అత్తలు. అయితే అది క్షుద్రపూజలు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

woman suspicious death in Bhudan Pochampally, telangana
Author
First Published Aug 29, 2022, 8:31 AM IST

భూదాన్ పోచంపల్లి :  యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరులో మూటపురం అనూష (30) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్త క్షుద్రపూజల వల్లే ఆమె బలి అయిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం ఎస్. లింగోటం గ్రామానికి చెందిన అనూష వివాహం జూలూరుకు చెందిన మూటపురం బాబురావుతో 2017లో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఆరునెలల కుమారుడు ఉన్నాడు. విద్యుత్ శాఖలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్ అయిన బాబురావు చేయి ఇటీవల విద్యుదాఘాతానికి గురై కాలిపోయింది. 

కుటుంబ కలహాలతో బాబురావు నిత్యం భార్యను కొట్టి, వేధించేవాడు. ఈ క్రమంలో అనూష వారంరోజులుగా అమ్మ తల్లి సోకి అనారోగ్యంతో బాధ పడుతుంది. ఆదివారం ఉదయం బాబురావు తన బావమరిది గిరిబాబుకు ఫోన్ చేసి అనూష ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటనే రమ్మని చెప్పాడు. ఆయన వచ్చేసరికి ఓ గదిలో అనూష శరీరమంతా కాలిపోయి మృతి చెంది ఉంది.

అధ్యాపకురాలి వికృత చేష్టాలు.. చచ్చుబడిపోయిన విద్యార్థిని కాళ్లు.. అస‌లేం జ‌రిగిందంటే..

క్షుద్రపూజ లేనా?
అనూష అత్త యాదమ్మ తరచూ  క్షుద్ర పూజలు చేస్తుంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శనివారం అమావాస్య కావడం,  అనూష మృతదేహం పక్కన నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండడం, ఉదయం వరకు ఇంట్లో పెద్దదీపం వెలుగుతూ ఉండటం వంటివి విచారణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇంట్లో క్షుద్రపూజలు జరిగి ఉండవచ్చని అనుమానాలకు బలం చేకూరుతోంది. అనూషకు మత్తు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత క్షుద్రపూజలు చేసి, చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూష ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు భర్త, అత్త ఆమె ఒంటిపై యాసిడ్ పోసినట్లు సమాచారం. 

ఇంట్లోని వస్తువులను ధ్వంసం
అనూషను భర్త, అత్త కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు బాబురావు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. న్యాయం చేసేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు ఇరు కుటుంబాల పెద్ద మనుషులు రూ.7.50 లక్షల పరిహారం ఇచ్చేందుకు అంగీకారం చేసుకున్నట్లు సమాచారం. బాబురావు, యాదమ్మ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైది రెడ్డి తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios