పదవ అంతస్థు పైనుండి దూకిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదం హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: నిర్మాణంలో వున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన భవనంపైనుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పదవ అంతస్థు పైనుండి దూకిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాదం హైదరాబాద్ శివారులోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... తుక్కుగూడ ప్రాంతానికి చెందిన సత్య సంతోషిణి-పవన్ భగవాన్ భార్యాభర్తలు. వీరికి పెళ్లయి మూడేళ్లవుతున్నా సంతానం కలగడం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య ఈ విషయమై తరచూ గొడవలు జరిగేవి. ఇలా పిల్లలు పుట్టకపోవడం, భర్తలో మనస్పర్థలను తట్టుకోలేకపోయిన సంతోషిణి దారుణ నిర్ణయం తీసుకుంది.
కీసర పోలీస్ స్టేషన్ పరధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన అపార్టుమెంట్ పదవ అంతస్తు పైనుండి దూకి సంతోషిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సంతానం కలగకపోవటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి సదరు మహిళ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అంచనావేశారు. ఆత్మహత్యకు గల కారణాల విషయంలో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తామని... ఇప్పటికే దర్యాప్తు ప్రారంభినట్లు స్థానిక సిఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
