హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ విషాద ఘటన చోటుచేసుకుంది.  మానసిక స్థితి  బాగోలేని ఓ మహిళ తాము నివాసముండే భవనం ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ ఉదయం ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు గుర్తించి అడ్డుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మరోసారి బలవన్మరణానికి పాల్పడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అక్బర్ బాగ్ ప్రాంతంలోని శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లోని ఓ కుటుంబం నివాసముంటోంది. అయితే ఆ కుటుంబంలో శిరీష(30) అనే మహిళ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు బైటికి ఎక్కడికీ పంపించకుండా జాగ్రత్తపడుతున్నారు. 

ఇవాళ ఉదయం శిరీష ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు గమనించి కాపాడారు. అయితే మళ్లీ కొద్దిసేపటి క్రితం ఇంట్లోంచి బైటికివచ్చిన శిరీష అపార్ట్  మెంట్ భవనం ఐదో అంతస్తు నుండి కిందకు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన శిరీష అక్కడిక్కడే మృతిచెందింది. 

ఈ ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మానసిని స్థితి  బాగోలేకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.