హైదరాబాద్: తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి  తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైద్రాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, తల్లీ కొడుకు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా మధుగిరి తాలుకా చందబావి గ్రామానికి చెందిన సురేష్, సుమ దంపతులు రెండేళ్లుగా మియాపూర్ లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు.  వీరికి ఇద్దరు కవలలు. వీరి వయస్సు ఐదేళ్లు. సురేష్ బాచుపల్లిలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.

బుధవారం నాడు సురేష్ కంపెనీ నుండి ఇంటికి వచ్చేసరికి భార్యా పిల్లలు ఇద్దరు అపస్మారకస్థితిలో ఉన్నారు. అతనుచ వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చిన్నారి హర్షిత మృతి చెందింది. సుమ, ఆమె కొడుకు హర్ష ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.

సురేష్  తాను పనిచేసే కంపెనీలోని సహోద్యోగితో చనువుగా ఉండే విషయమై భార్యాభర్తల మధ్య ఇటీవల కాలంలో గొడవలు చోటు చేసుకొన్నట్టుగా సమాచారం. ఈ గొడవల కారణంగానే సుమ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.