ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోవడానికి ఓ యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. చచ్చిపోతున్నానంటూ లేఖ రాసి మాయమైంది. పథకం ప్రకారం.. ఇంటి నుంచి పనికి ఎంఎంటీఎస్‌ రైల్లో వెళ్తున్న సమయంలో చెల్లికి లేఖ రాసిచ్చి ఇప్పుడే వస్తానని చెప్పివెళ్లింది. 

అందరినీ తప్పుదోవ పట్టించేందుకు తన బ్యాగ్‌ను నెక్లెస్ రోడ్‌ ప్రాంతంలో నాలా వద్ద పడేసింది. దాంతో యువతి ఎంఎంటీఎస్‌ రైల్లో నుంచి నాలాలోకి దూకిందనుకోని గాలించారు. కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. తీరా.. దర్యాప్తులో భాగంగా నిజం తెలియడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాణిగంజ్‌కు చెందిన ఓ యువతి(28) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు తన చెల్లితో కలిసి ఎంఎంటీఎ్‌సలో ఉద్యోగానికి బయల్దేరింది. ఎంఎంటీఎస్‌ రైలు సంజీవయ్యపార్క్‌ ప్రాంతానికి రాగానే చెల్లికి ఓ లేఖ ఇచ్చి రైలు దిగి వెళ్లిపోయింది. ఆ లేఖలో ‘నేను చనిపోతున్నాను, అమ్మానాన్న క్షమించండి’ అని రాసి ఉంది. ఆమె ఈ వార్తను ఇతరులతో పంచుకోవడంతో అసలు సంగతి తప్పుదారి పట్టింది. 

సమీపంలో ఉన్న నాలాలో దూకి ఉంటుందని ఊహించి అదే నిజమని ప్రచారం ప్రారంభించారు. హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపుల చర్యలు ప్రారంభించారు. ఆ యువతి సాయంత్రం 6గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాను ప్రియుడితో వెళ్లిపోయిన సంగతి తాపీగా చెప్పింది. దాంతో కుటుంబీకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు చివరకు తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.