నల్లగొండ: భూతవైద్యుడు తన పట్ల అసభ్య ప్రవర్తిస్తుండడంతో ఓ మహిళ తన ప్రియుడు, భర్తలతో కలిసి అతన్ని హత్య చేసింది.  గొంతు కోసి అతన్ని హత్య చేసింది. ఈ సంఘటన గత నెల 31వ తేదీన నల్లగొండ జిల్లా శౌలిగౌరారం మండలం గురజాల శివారులో చోటు చేసుకుంది. ఈ కేసును పోలీసులు ఛేదించారు.

నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గురజాలకు చెందిన సాలమ్మ, చిన్నవెంకన్న దంపతుల కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నడాు. దాంతో అదే గ్రామానికి చెందిన వెంపటి యాదయ్య అనే భూతవైద్యుడిని వారు సంప్రదించారు. కొద్ది రోజులకు ఆరోగ్యం మెరుగుపడింది.

ఆ క్రమంలోనే యాదయ్యతో సాలమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు సాలమ్మ అనారోగ్యానికి గురైంది. దీంతో యాదయ్య సూచన మేరకు హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఉంటున్న గురజాల వాస్తవ్యుడైన వెంపటి శంకర్ అనే భూతవైద్యుడిని సంప్రదించారు. 

ఆమెకు అతను భూతవైద్యం ప్రారంభించాడు. ఈ క్రమంలో సాలమ్మ పట్ల శంకర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. దాంతో అతన్ని చంపడానికి సాలమ్మ పథక రచన చేసింది. గురజాల శివారులోని మూసీ నది వద్ద గత 31వ తేదీన భూత వైద్యం చేస్తుండగా యాదయ్య, చిన్న వెంకన్నతో పాటు గ్రామానికే చెందిన రమేష్, గూని యాదయ్య, మారమ్మ అక్కడికి చేరుకున్నారు.

శంకర్ అంతా కదలకుండా పట్టుకోగా, సాలమ్మ అతని గొంతును కోసి చంపింది. ఆ తర్వాత శవాన్ని వాగులోనే పూడ్చి పెట్టింది. ఈ నెల 4వ తేదీన శవాన్ని గుర్తించిన పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.