ప్రియుడితో కలిసి  భర్తను దారుణంగా హత్య చేసింది. కానీ కుటుంబసభ్యులను, బంధువులను మాత్రం... గుండె నొప్పితో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం  చేసింది. బంధువులను అనుమానం వచ్చి నిలదీయడంతో సోదరుడితో కలిసి చంపానని నమ్మించాలని అనుకుంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి... వాళ్ల స్టైల్ లో దర్యాప్తు చేయగా...  ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ సంఘటన ఎల్బీనగర్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా, నేరెడుచర్ల మండలం, పందిరిగుండు తండాకు చెందిన పలావత్ ప్రసాద్ బాబు(38) సరోజ దంపతులకు ఇద్దరు సంతానం. బతుకు దెరువు కోసం ఏడాది క్రితం నగరానికి వచ్చి ఆటో నడుపుతూ కుటుంబంతో కలిసి ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ లో నివసిస్తున్నాడు. 

చిట్టీల వ్యాపారంలో నష్టం రావడంతో గుప్త నిధుల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో దాదాపు రూ.40లక్షలు అప్పు చేశాడు. తమ గ్రామంలో ఉన్న ఒక ఎకరం పొలాన్ని అమ్మి రూ.25లక్షల అప్పు తీర్చాడు. మిగిలిన అప్పుల బాధ పెరగడంతో నిత్యం ఇంటికి మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక సరోజ కొంతకాలం పుట్టింటికి వెళ్లింది.

ఈ సమయంలో దేవరకొండ మండలం, బొడ్డుపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నర్సింహ(30)తో సరోజకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలం తర్వాత పెద్దలు నచ్చచెప్పడంతో మళ్లీ భర్త వద్దకు వచ్చింది. కానీ... భర్త తరచూ మద్యం సేవించి విసిగిస్తుండటంతో.... ప్రియుడికి చెప్పింది. అతనితో  కలిసి పథకం వేసింది.

అప్పులు తీర్చుకోవడానికి ఫైనాన్స్ ఇస్తారని చెప్పి ప్రియుడిని భర్తతో ఇంటికి పిలిచింది. ప్రసాద్ బాబు మద్యం మత్తులో ఉన్న సమయంలో... నర్సింహ, సరోజలు మెడకు ఉరివేసి హత్య చేశారు. తర్వాత గుండె నొప్పితో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆమె నేరం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.