భర్తను కాదని... మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధానికి భర్త అడ్డుగా అనిపించాడు. అంతే... వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లి మరీ... సజీవదహనం చేశారు. హైదరాబాద్ కి చెందిన వ్యక్తి కర్ణాటకలోని కలబురిగి పట్టణంలో దారుణ హత్యకు గురయ్యాడు.

పూర్తివివరాల్లోకి వెళితే... ఏపీలోని కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన నాగరాజు(40) అదే జిల్లాలోని నందివాడ మండలానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. కాగా... వారు జీవనోపాధి కోసం హైదరాబాద్ కి వచ్చారు. ఇక్కడ నగరంలోని ప్రగతినగర్ పరిధి ఎలీప్ పారిశ్రామికవాడ సమీపంలో అద్దెకు ఉంటూ వేర్వేరు కంపెనీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ప్రగతి నగర్ కి చెందిన స్థిరాస్తివ్యాపారి వెంకటేశ్వర్ రెడ్డి వద్ద నాలుగేళ్ల క్రితం దంపతలిద్దరూ కాపలాదారులుగా పనిచేశారు.

ఈ క్రమంలో యజమానితో నాగరాజు భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం నాగరాజుకి తెలిసిపోయింది. దీంతో ఇద్దరినీ నిలదీశాడు. వెంటనే అక్కడ పనిమానేసి ఇల్లు కూడా మార్చేశాడు. అయినా వారిద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈక్రమంలో... అడ్డుగా ఉన్న నాగరాజుని అంతమొందించాలని ప్లాన్ చేశాడు.

ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన నాగరాజుని కారులో ఎక్కించుకొని బయటకు తీసుకువెళ్లాడు. మద్యం సీసాలు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడు. కర్ణాటక తీసుకువెళ్లి మద్యం మత్తులో ఉన్ననాగరాజుని సజీవదహనం చేశాడు. కాగా... బయటకు వెళ్లిన నాగరాజు తిరిగి రాకపోవడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో అసలు విషయం బయడటపడింది. నాగరాజుని చంపడానికి దాదాపు సంవత్సరం నుంచి ప్లాన్ వేసినట్లు నిందితుడు దర్యాప్తులో అంగీకరించాడు. గతంలో రెండు, మూడు సార్లు ప్రయత్నించి విఫలం చెందినట్లు తెలిపాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.