ఇద్దరు భార్యలు ముద్దుల మొగుడు ఆ భార్యల చేతిలోనే హతమైన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. ఆస్తి గొడవల్లో మొదటి భార్య బంధువులతో కలిసి భర్తమీద దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ప్రాణాలు వదిలాడు. 

వివరాల్లోకి వెడితే ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామ పరిధిలోని పల్లెమీది తండాకు చెందిన ధరంసోత్ శంకర్ నాయక్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సరోజన, రెండవ భార్య రాజవ్వలు. మొదటి భార్యకు పిల్లలు లేరు. రెండో భార్యకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు. 

మొదటి భార్య సరోజన భర్తను భూమి తన పేరన పట్టా చేయమని అడుగుతోంది. శంకర్ నాయక్ దీనికి నిరాకరిస్తుండడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు అడిగినా భూమి తన పేరుమీద చేయడం లేదని మనసులో పెట్టుకుంది. తమ్ముడు భానోతు శ్రీనివాస్, చెల్లె తేజావత్ లక్ష్మిలను ఇంటికి రమ్మని పిలిచింది. 

వీళ్లు ముగ్గురు కలిసి భర్త శంకర్ నాయక్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బాగా దెబ్బలు తగలడంతో  మండల కేంద్రంలోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శంకర్ నాయక్ రాత్రి చనిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండవభార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ ఛార్జ్ సీఐ వెంకటనర్సయ్య తెలిపారు.