మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా మందలించాడని ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన చేర్యాలలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మల్లన్న గుట్ట హనుమాన్ గుడి పక్కన కుళ్లిపోయిన మృతదేహం ఉన్నట్లు నవంబర్ 24న అనుమానాస్పద కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టగా మృతదేహంపై గోరు కాట్లు కనిపించాయి. ఆలయ పరిసరాల్లో మృతుడు, మహిళ తిరిగినట్లు సీసీ కెమేరాల్లో నమోదైన దృశ్యాలు ఉన్నాయి.

అదే ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ముసుగు వేసుకున్న మరో వ్యక్తి వారిద్దరినీ వెంబడిస్తుండటం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. జిల్లాలో 18 అదృశ్యం కేసుల ఫోటోలతో మృతుడి ఆనవాలను పరిశీలించారు. మూడు పోలీసు బృందాలు సిద్ధిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలో గోడపత్రికలు వేసి మరీ దర్యాప్తు చేశాయి.

చివరకు కుటుంబసభ్యులు మృతదేహాన్ని గుర్తుపట్టారు. అతను రాయపోల్ మండలం పెద్దఆరెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి(40) సీసీ కెమేరాల్లో ఉన్నది అతని భార్యే అని గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. నేరం తానే చేసినట్లు అంగీకరించింది. ఆమె  మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం భర్తకు తెలియడంతో.. ఆమెను పలుమార్లు మందలించాడు. ఈ క్రమంలో.. ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.