తనని కాదని భర్త రెండో పెళ్లి చేసుకోవడం ఆమె తట్టుకోలేకపోయింది. భర్త తనకు దూరమౌతున్నాడనే బాధను ఆమె తట్టుకోలేకపోయింది.  ఎన్నో ఏళ్లుగా  తనలో భర్తపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో.. భర్త రెండో భార్య ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్గొండ పట్టణం జూబ్లిహిల్స్ కాలనీకి చెందిన మేకల ప్రదీప్, ప్రసన్నరాణి(45) దంపతులు ఐసీడీఎస్ శాఖలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ భువనగిరిలో, ఆయన భార్య మునుగోడులో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 1999లో వివాహమైంది. కుమారుడు(20), కుమార్తె(15) ఉన్నారు.

కాగా.. ప్రదీప్.. భార్యకు తెలీకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం  శాంత అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మేఘన(6), రుచరి(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం భర్త రెండో పెళ్లి విషయం ప్రసన్న రాణి దృష్టికి వచ్చింది.  అప్పటి నుంచి తరచూ ఆమె భర్త తో, ఆయన రెండో పెళ్లి చేసుకున్న మహిళతో గొడవపడుతూ వస్తోంది.

కాగా.. ఆరు నెలలుగా మాత్రం భర్తతో, అతని రెండో భార్యతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. భర్త తనకి కాకుండా.. రెండో భార్యకు నల్గొండలో ఇల్లు కడుతున్నాడనే విషయం తెలిసి మరింత కోపంతో ఊగిపోయింది.

ఈ క్రమంలో భర్త మీద, రెండో భార్య శాంత మీద ఆమె పగ పెంచుకుంది. ఈ క్రమంలో శాంత ఇంటికి వెళ్లి.. ఆమె లేని సమయంలో.. ఇద్దరు కుమార్తెలకు ఉరి బిగించి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది.

‘ డియర్ ప్రదీప్.. నన్నుకాదని రెండో పెళ్లి చేసుకున్నావ్. 20ఏళ్ల కొడుకు ఉన్న నీకు రెండో భార్య కావాల్సి వచ్చింది. ఈ విషయంలో నీతో సహా మీ కుటుంబంలో అందరూ నన్ను మోసం చేశారు. అందుకే ఏ రోజైతే నీ జీవితంలోకి వచ్చానో.. అదే రోజు వెళ్లిపోతున్నాను.’ అంటూ లేఖ రాశి ప్రసన్నరాణి ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.

ప్రసన్న రాణి ఆమె చనిపోవడంతో పాటు..తన సవితి ఇద్దరు కూతుళ్లను కూడా చంపేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.