హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాదులోని సరూర్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. నందనవనం సమీపంలోని ఇంద్రసేనరెడ్డి నగర్ బస్తీలో మహిళ హత్యకు గురైంది. దేవరకొండకు చెందిన ఓ మహిళ (32) భర్త చనిపోవడంతో కొద్ది రోజుల క్రితం 13 ఏళ్ల కుమారుడితో కలిసి హైదరాబాదు వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. 

అయితే, కొంత కాలంగా జిల్లెలగుడా గాయత్రీనగర్ కు చెందిన పోరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అతను తరుచుగా ఆమె ఇంటికి వచేచడావని, రాత్రుళ్లు కూడా అక్కడే ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి బుధవారం్ రాత్రి మహిళ ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు.

గురువారం తెల్లారేసరికి ఆమె మరణించింది. తెల్లవారు జామున మూడు గంటలకు లేచి చూస్తే ఆమె మరణించి కనిపించిందని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. మృతురాలి గొంతు నులిమినట్లు, మెడపై గాయాలున్నట్లు పోలీసు విచారణలో తేలింది. దాంతో మహిళను హత్య చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

తనకు మహిళతో వివాహేతర సంబంధం ఉన్న మాట వాస్తవమేనని, ఆమెను తాను చంపలేదని శ్రీకాంత్ చెబుతున్నట్లు సమాచారం. రాత్రంత అక్కడ ఉన్న శ్రీకాంత్ రెడ్డికి తెలియకుండా ఆమెను ఎవరు చంపుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇద్దరి మధ్య ఏదైనా విషయంపై గొడవ జరిగి జరిగిందా, మద్యం మత్తులో శ్రీకాంత్ రెడ్డే ఆమెను చంపి ఉంటాడా అనే కోణంలో పోలీసులు దర్యాపు చేస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.