పెద్దలను ఎదరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ తమను విడదీస్తారో అనే భయంతో అమెరికా వెళ్లిపోయారు. అక్కడ సంతోషంగా గడిపారు. అనుకోకుండా భారత్ కి వచ్చారు. అంతే... అప్పటి దాకా ప్రేమగా చూసుకున్న భార్యను ఆమె భర్త దూరం పెట్టాడు. అసలు ఆమె ఎవరో కూడా తెలియనట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తర్వాత.. నువ్వు నాకు వద్దు పోమ్మంటూ గెంటేశాడు. ఈ సంఘటన నల్గొండ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన సురకంటి రవీందర్‌రెడ్డి ఎంఎస్‌ చదివాడు, సుజాత ఇంజనీరింగ్‌ చదివింది.  ఇద్దరివీ పక్క పక్క ఇళ్లే.  2015లో ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుని, అమెరికా వెళ్లారు. ఏడాది గడిచాక అందరి సమక్షంలో పెళ్లి చేస్తానని నమ్మబలికిన రవీందర్‌రెడ్డి తండ్రి చంద్రారెడ్డి ఇద్దరిని ఇండియాకు రప్పించాడు. 

అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తండ్రి ప్రవర్తనను చూసిన రవీందర్‌రెడ్డి, మూడు రోజుల్లో భార్య సుజాతను తీసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కొడుకు వ్యవహారం నచ్చని చంద్రారెడ్డి ఎలాగైనా కొడుకు నుంచి సుజాతను విడదీయాలని అమెరికా వెళ్లాడు. అక్కడ చంద్రారెడ్డి ఉన్నంత కాలం రవీందర్‌రెడ్డి భార్య సుజాతను దూరంగా పెట్టాడు. 

తండ్రి వెళ్లాక కూడా సుజాతను దూరంగా ఉంచడంతో అనుమానంతో భర్త రవీందర్‌రెడ్డిని నిలదీసింది. దీంతో మనం కలిసి ఉండటం మా తల్లిదండ్రులకు ఇష్టంలేదని, విడాకులు తీసుకుందామని చెప్పడంతో దేశం కాని దేశంలో ఏం చేయాలో తెలియక ఆన్‌లైన్‌లో రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌కు ఫిర్యాదు  చేసింది. దీంతో రవీందర్‌రెడ్డి 2018లో సుజాతను స్వగ్రామం తీసుకొచ్చాడు. 

తండ్రి మాటలు విని రవీందర్‌రెడ్డి భార్య సుజాతను వదిలి ఏడాది కిందట అమెరికా వెళ్లిపోయాడు. అప్పటినుంచి హైదరాబాద్‌ అత్తారింట్లో ఉంటున్న సుజాతను అత్తామామలు చిత్రహింసలు పెట్టారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు కూడా యత్నించింది. తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించడంతో బతికి బయటపడింది. కాగా.. ఇప్పుడు భర్త కోసం.. అత్తారింట్లో అడుగుపెట్టడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలను వారు తిప్పికొడుతున్నారు. దీంతో సదరు మహిళ భర్త కోసం అత్తారింటి ముందు ఆందోళన చేపట్టింది.