సూర్యాపేట: ఇటీవలే జన్మనిచ్చిన బిడ్డకు పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించి కాపాడబోయి ఓ బాలింత మృత్యువాతపడింది. కోతుల గుంపు దాడి నుండి తప్పించుకునే ప్రమాదంలో బాలింత ప్రమాదానికి గురయి చనిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన దోమల శ్రీలతకు అర్వపల్లి మండలం అడివెంల గ్రామానికి చెందిన సైదులుతో వివాహమైంది. ఈ దంపతులకు ఇప్పటికే నాలుగేళ్ల బాలుడు, రెండేళ్ల పాప సంతానం వుంది. అయితే ఆమె మూడోసారి గర్భం దాల్చడంతో కాన్పుకోసం పుట్టింటికి వచ్చింది.  

ఈ క్రమంలో ఇటీవలే శ్రీలత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే మంగళవారం బిడ్డను ఊయలలో పడుకోబెట్టి శ్రీలత ఇంటిపనులు చేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు ఇంటి ఆవరణలోకి వచ్చాయి. దీంతో కోతులు ఎక్కడ తన బిడ్డ వద్దకు వెళ్ళి హాని తలపెడతాయని ఆమె భయపడిపోయింది. ఈ క్రమంలో బిడ్డను కాపాడుకునేందుకు పరుగు పెడుతుండగా ఒక్కసారిగా జారిపడి ప్రమాదానికి గురయ్యింది. 

ఈ ప్రమాదంలో తీవ్ర గాయలపాలయిన శ్రీలత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన ముగ్గురు చిన్నారులను తల్లిప్రేమకు దూరం చేసింది. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.