హైదరాబాద్: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకొని  జీవితాంతం కలిసి ఉందామని భావించిన ఆ యువతి ఆశలను కరోనాతో ఆవిరయ్యాయి.  ఐసీయూలోనే తాను ప్రేమించిన యువతికి ఆ యువకుడు తాళికట్టి ఆమెకు ధైర్యం చెప్పాడు. కానీ,  కరోనాతో ఆ యువతి మరణించింది.సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన  27 ఏళ్ల యువతి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తోంది. అయితే ఉన్నతోద్యోగం చేస్తున్న యువకుడిని ఆమె ప్రేమించింది. తమ ప్రేమ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు. 

ఇదే సమయంలో కరోనా రూపంలో ఆ యువతిని దురదృష్టం వెన్నాడింది.  దీంతో యువతి కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు ఆమెకు ధైర్యం చెప్పాడు.  ఆమె పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల అనుమతితితో ఆ యువకుడు ఐసీయూలోకి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. అంతేకాదు ఆమెకు ధైర్యం చెప్పాడు. 

కరోనాను ఎదుర్కొని నువ్వు క్షేమంగా ఇంటికొస్తావన్నారు. ఐసీయూలో బెడ్‌ మీద ఉన్న యువతి మెడలో తాళి కట్టాడు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతి మృత్యువుతో పోరాడి ఇటీవల కన్నుమూసింది. యువతి సోదరుడు,తాళి కట్టిన యువకుడు(ప్రియుడు) ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.  యువతి మరణించిన విషయాన్ని తలుచుకొని ప్రియుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.