కరోనా సెకండ్ వేవ్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తోంది. వైరస్ సోకి తేరుకోలేక చనిపోతున్న వాళ్లు కొందరైతే కరోనా సోకిందన్న భయంతో గుండె ఆగి మృత్యువాత పడుతున్న వాళ్లు మరికొందరు. కరోనా ఎంత గుండె నిబ్బరాన్నైనా నీరు గారేలా చేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ హృదయవిదారక ఘటన కొత్తగూడెంలో విషాదాన్ని నింపింది. 

కరోనా వచ్చిందన్న భయంతో ఓ మహిళ భావోద్వేగానికి గురై భర్త, పిల్లలు ఎదుటే మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబీకులు గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీకి చెందిన నారం శ్రీదేవి (35) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు.

వైద్య పరీక్షల కోసం శుక్రవారం వినాయకపురం ప్రాథమిక వైద్యశాలకు వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో శ్రీదేవి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మందులు తీసుకుని ఇంటికి వచ్చారు.

భర్త ఇద్దరు పిల్లలను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యింది. దీంతో ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. వెంటనే భర్త వైద్య సిబ్బందికి సమాచారం అందించాడు. సిబ్బంది వచ్చేలోపే ఆ మహిళా మృత్యుఒడి లోకి వెళ్లింది. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona