అత్తారింట్లో ఉన్న కన్నకూతురిని చూడటానికి ఆ దంపతులు బయలుదేరి వెళ్లారు. కానీ.. అనుకోని ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. అప్పటి వరకు ఆనందంగా వెళ్తున్న వారి వాహనాన్ని లారీ రూపంలో మృత్యువు కబలించింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తుర్కపల్లి మండలం ముల్కలపల్లికి చెందిన రైతు బద్దం నర్సిరెడ్డి తన భార్య రమణమ్మ(52)తో కలిసి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరిలోని కుమార్తె ఇంటికి బైక్‌పై బయలుదేరారు. బైక్‌పై ఇద్దరూ మాట్లాడుకుంటూ జిల్లా కేంద్రంలోని జగదేవ్‌పూర్‌ చౌరస్తా చేరుకున్నారు. వారిని ఓ లారీ ఓవర్‌టేక్‌ చేస్తున్న సమయంలో.. దురదృష్టవశాత్తూ వారి బైక్‌ అదుపు తప్పి దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. 

ఈ క్రమంలో.. రమణమ్మపై నుంచి లారీ వెళ్లిపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి నర్సిరెడ్డి విలపించిన తీరు, చూపరులను కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.