ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ప్రేమపెళ్లి వివాదానికి దారి తీసింది. అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులమీద దాడి చేయడంతో అబ్బాయి వదిన మృతి చెందింది. 

పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో సంపంగి కృప, అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి సంతోష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న పెళ్లిచేసుకుని ఎటో వెళ్లిపోయారు. 

ఇది నచ్చని అమ్మాయి బంధువులు సంపంగి లక్ష్మయ్య, లింగస్వామి, శాంతమ్మ ఈనెల 6న గొడ్డలి, రోకలి బండలతో అబ్బాయి వదిన ఉష(32), అన్న చెన్నయ్య మీద దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఉషను వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి ఉష మృతి చెందింది. ఈమెకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం మీద మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు.

ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.