పదో కాన్పులోనూ అమ్మాయి పుట్టడంతో బాధతో కుమిలిపోయిన తల్లి.. కోపంతో ఆ బిడ్డకు పాలు ఇవ్వలేదు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చందంపేట గ్రామానికి చెందిన ఇస్లావత్ సావిత్రి-రాజు దంపతులకు ఇప్పటికే 9 మంది సంతానం.

ఇప్పటికే ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నా మరో అబ్బాయి కోసం ప్రయత్నించారు.. గర్భం దాల్చిన సావిత్రి పదో బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది అమ్మాయి అని తెలుసుకున్న ఆ దంపతులు నిరాశకు గురయ్యారు, వారితో పాటు చిన్నారి అమ్మమ్మ సైతం బిడ్డను చూసేందుకు నిరాకరించారు.

ఆకలితో పసికందు ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు. పాలిచ్చేందుకు ముందుకు రాలేదు.. బిడ్డ ఎంతకు ఏడుపు ఆపకపోవడంతో చలించిపోయిన చుట్టుపక్కలవారు వారిని మందలించారు. పాలుపట్టాలని చెప్పినా తల్లి ముందుకు రాలేదు.

చివరికి వారే పెద్ద మనసుతో పోతపాలు పట్టి బిడ్డ ఆకలి తీర్చారు. మరోవైపు బిడ్డను విక్రయించేందుకు చిన్నారి తల్లిదండ్రులు ప్రయత్నించడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరింది. చిన్నారి కనిపించకపోయినా, ఆమెకేమన్నా జరిగినా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారుల మాట వినకపోగా.. వాగ్వాదానికి దిగడంతో పోలీసుల ద్వారా చిన్నారిని ఇంటికి తీసుకెళ్లడానికి అంగీకరించారు.