హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్‌చెరువు మండలం గణపతిగూడెం గ్రామంలో దారుణం చోట చేసుకొంది.  

ఖననం చేసిన మృతదేహానికి గుండు గీశారు దుండగులు.  ఈ విషయాన్ని గుర్తించిన బాధిత కుటుంబసభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పటాన్‌చెరువు మండలం గణపతిగూడెం గ్రామానికి చెందిన మల్లమ్మ అనే మహిళ అనారోగ్యంతో ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితం మృతి చెందింది.

సంప్రదాయం ప్రకారంగా ఆ మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులు పెట్టెలో పెట్టి ఖననం చేశారు. మూడో రోజున సంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించడం కోసం  పెట్టెను తీశారు. 

అయితే పెట్టెలో ఉన్న మల్లమ్మ మృతదేహనికి గుండు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. పెట్టెను తీసి చూసిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.ఈ విషయమై మల్లమ్మ కొడుకు రాజు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి ఎవరు గుండు గీశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

ఖననం చేసిన మృతదేహన్ని తీసి గుండు గీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని  కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. మల్లమ్మ మృతదేహన్ని ఎవరు బయటకు తీయాల్సి వచ్చిందనే విషయమై కూడ ఆరా తీయాలని కుటుంబసభ్యలు కోరుతున్నారు.