తనకు పెళ్లి కావడం లేదనే బెంగతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బెజ్జంకి మండలంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి మండలం ఎల్లంపల్లికి చెందిన వడిగె శిరీష(19) డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటోంది. కాగా.. కోహెడ మండలం మైసం పల్లికి చెందిన శ్రావణ్ అనే యువకుడిని శిరీష మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తోంది.

ఇటీవల వారు తమ పెళ్లి విషయాన్ని పెద్దల ముందు ప్రస్తావించగా.. వారు కూడా అంగీకారం తెలిపారు. కాగా.. శిరీష తండ్రి నర్సింగం సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. తల్లి ఇక్కడ వ్యవసాయ కూలీగా చేస్తోంది. కాగా.. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా శిరీష తండ్రి భారత్ కి రాలేకపోతున్నారు. ఆయన ఇక్కడకు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దామని తల్లి చెప్పింది. 

అయితే.. తన తండ్రి రావడం ఆలస్యం అవుతోందని.. ఆ కారణంగా తన పెళ్లి ఆలస్యమౌతోందని శిరీష తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ క్రమంలో  ఆగస్టు 28వ తేదీన శిరీష ఇంట్లో పరుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసింది. శిరీష తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.