వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక మేనమామ ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన జువ్వండి వంశీరావుతో శ్రీలతకు 2011లో వివాహం జరిగింది.

2012లో ఆమె భర్తతో కలిసి లండన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి శ్రీలతను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆమె తల్లి చంద్రకళ 2016లో మరణించారు.

తల్లి మరణంతో శ్రీలత భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చి కొద్ది నెలలు ఉన్నారు. మళ్లీ లండన్ వెళ్లిన తర్వాత కూడా భర్త వేధింపులు ఆగకపోవడంతో 2018 ఫిబ్రవరిలో శ్రీలత రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది.

అదే ఏడాది జూన్‌లో హైదరాబాద్ వచ్చిన వంశీ.. శ్రీలతను, పాపను రామంతపూర్‌లోనే వదిలి ఒక్కడే లండన్ వెళ్లాడు. అయితే ఇక్కడ అత్తమామలు సుమారు 10 నెలల నుంచి వేధిస్తుండటంతో ఆమె వాటిని తట్టుకోలేకపోయింది.

దీంతో ముంబైలో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి ఆమె మృతదేహాన్ని మేనమామ వెంగళ్‌రావు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీలత అత్తమామాలు జువ్వాడి రాజేశ్వర్‌రావు, ఆశాలతలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బంధువులు ఆమె మృతదేహాన్ని అక్కడే ఉంచి ఆందోళనకు దిగారు.