హోళీ పండగపూట ఓ తల్లి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

సిరిసిల్ల: ఏ కష్టం వచ్చిందో ఏమోగానీ హోళీ పండగపూటే కన్న కూతుళ్లతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricilla)లో చోటుచేసుకుంది. మొదట ఇద్దరు చిన్నారులను చెరువులోకి తోసేసిన తల్లి ఆ తర్వాత తాను కూడా దూకి ప్రాణాలు తీసుకుంది.

వివరాల్లోకి వెళితే... సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేఖకు మూడేళ్ల అభిజ్ఞ, 6నెలల హంసిక సంతానం. అయితే గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్న రేఖ ఇక బాధలు భరించలేనని అనుకుందో ఏమోగానీ దారుణ నిర్ణయం తీసుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.

తన కూతుళ్లతో కలిసి గ్రామ శివారులోని చెరువువద్దకు చేరుకున్న రేఖ ముందుగా ఇద్దరు కూతుళ్లను నీటిలోకి తోసేసింది. ఈ వెంటనే ఆమెకూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో నీటమునిగి ముగ్గురూ మృతిచెందారు. 

ఈ ఆత్మహత్యల గురించి తెలిసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే చెరువువద్దకు చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సాయంతో మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అభిజ్ఞ, హంసిక మృతదేహాలు లభించాయి. రేఖ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

హోళీ పండగపూట ఇలా తల్లీకూతుళ్ల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబకలహాలే వీరి ఆత్మహత్యలకు కారణమా లేక ఇంకా ఏదయినా కారణముందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలావుంటే శ్రీకాకుళం జిల్లాలోనూ ఇలాగే ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ప్రతిరోజూ భర్త వేధింపులను భరించలేక ఆత్మహత్యకు సిద్దమైన మహిళ తాను చనిపోతే ఇద్దరు బిడ్డలను పట్టించుకునేవారు వుండరని భావించినట్లుంది. అందుకే ఇద్దరు బిడ్డలకు ముందుగా చంపి ఆ తర్వాత తానుకూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసింది. 

శ్రీకాకుళం పట్టణంలోని దమ్మలవీధికి చెందిన ధనలక్ష్మి (27)కి గార మండలం పేర్లవానిపేటకు చెందిన లక్ష్మీనారాయణతో పన్నెండేళ్ళ కిందట వివాహమయ్యింది. అయిదేళ్ల పాటు కాపురం చక్కగానే సాగింది. ఆ తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో ధనలక్ష్మి ఇద్దరు పిల్లలు సోనియా (11), యశ్వంత్ (9)తో కలిసి ఏడేళ్ల కిందట తండ్రి మైలపల్లి ఎర్రయ్య ఇంటికి వచ్చేసింది.

కాకినాడలో షిప్ లో పనిచేసే లక్ష్మీనారాయణ అప్పుడప్పుడు వచ్చి వీరిని చూసి వెళుతూ వుండేవాడు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతుండేవి. ఏడాది నుంచి ఒక్కసారి కూడా భార్య, పిల్లలను చూసేందుకు రాలేదు. ఆదివారంనాడు ధనలక్ష్మి భర్తతో ఫోన్లో మాట్లాడింది. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో.. ఏమో కానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇతర పిల్లలతో పాటు తాను ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది.