అతని మాటలను యువతి నిజమని నమ్మేసింది. కానీ చివరకు దారుణంగా మోసం చేశాడు. మరో యువతి వెంట పడటం మొదలుపెట్టాడు. ఆ విషయం ఈ అమ్మాయికి తెలియడంతో.. తన ప్రేమికుడిని నిలదీసింది

ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. అతని మాటలను యువతి నిజమని నమ్మేసింది. కానీ చివరకు దారుణంగా మోసం చేశాడు. మరో యువతి వెంట పడటం మొదలుపెట్టాడు. ఆ విషయం ఈ అమ్మాయికి తెలియడంతో.. తన ప్రేమికుడిని నిలదీసింది. కాగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తట్టుకోలేకపోయింది. 

పెళ్లి చేసుకోను పో అంటూ నెట్టేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. కాగా.. యువతి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కుషాయిగూడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాప్రా గాంధీనగర్‌ కాలనీకి చెందిన ఓ యువతి (19) గత నెల 19న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. అదే కాలనీకి చెందిన కార్తీక్‌(24) అనే యువకుడు సదరు యువతిని ప్రేమిస్తున్నానని, నమ్మించి మోసం చేసినట్లు తేలింది. 

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే గాక తనను కాదని మరో అమ్మాయితో చనువుగా ఉండడంతో కార్తీక్‌ను యువతి నిలదీసింది. కార్తీక్‌ పెళ్లికి నిరాకరించి, దూరం పెడుతుండడంతో మనస్థాపానికి గురైన ఆ యువతి ఏప్రిల్‌ 19న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కార్తీక్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.