వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యభర్తల అనుబంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంపేస్తున్నాయి. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భర్త వేరే అమ్మాయితో రహస్యంగా వాట్సప్ చాట్ చేయడం భరించలేక ఓ భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యభర్తల అనుబంధాన్ని నిర్దాక్షిణ్యంగా తెంపేస్తున్నాయి. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. భర్త వేరే అమ్మాయితో రహస్యంగా వాట్సప్ చాట్ చేయడం భరించలేక ఓ భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

హైదరాబాద్, పటాన్ చెరు, రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన రామలక్ష్మి(25)కి మూడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డితో వివాహం జరిగింది. 

వీరు జీవనోపాధికై తెలంగాణలోని రామచంద్రపురం వలస వచ్చారు. వెంకట్‌ రెడ్డి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతనికి వివాహ సమయంలో కట్నం కింద ఎకరం భూమి, 50 గ్రాముల బంగారం, నగదును ఇచ్చారు. వివాహం తరువాత ఇద్దరు బాగానే కాపురం చేశారు. వారికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. 

ఇటీవల మృతురాలి భర్త వెంకట్‌ రెడ్డి ఆయన పని చేసే కంపెనీలో ఒక అమ్మాయితో సంబంధం ఏర్పరుచుకున్నాడు. రహస్యంగా వాట్సాప్‌ లో ఆమెతో చాటింగ్‌ చేసేవాడు. ఈ విషయం తెలిసి గతంలో మృతురాలు రామలక్ష్మి భర్త వెంకట్‌ రెడ్డిని నిలదీసింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. 

దీన్ని పెద్దది చేస్తే కూతురు సంసారం పాడవుతుందన్న ఆలోచనతో అల్లుడికి నచ్చజెప్పారు. ఆ సమయంలో తను చాటింగ్‌ చేయనని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చాడు. కాగా మృతురాలు రామలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా పుట్టింటికి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చింది. 

ఆ సమయంలో భర్త తిరిగి అమ్మాయితో చాటింగ్‌ చేసిన మెసేజ్‌ను చూసి ఆ మెసేజ్‌లను తన చెల్లికి పంపించింది. తన చెల్లికి ఫోన్‌ చేసి బావ మారలేదని, తిరిగి ఆ అమ్మాయితో చాటింగ్‌ చేస్తున్నాడని ఆ బాధ భరించలేక చనిపోతున్నా అని ఫోన్‌ పెట్టేసింది. తిరిగి చెల్లెలు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో తల్లిదండ్రులకు తెలియజేసింది. 

కాగా సోమవారం తెల్లవారుజామున అల్లుడు వెంకట్‌ రెడ్డి తమకు ఫోన్‌ చేసి తమ కూతురు రామలక్ష్మి పడక గదిలో ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారని తెలిపారు. తమ అల్లుడు మరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి తన కూతురు ఉరి వేసుకుని చనిపోయిందని అల్లుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.