తననే పెళ్లి చేసుకోవాలంటూ స్నేహితుడు  తరచూ వేధిస్తుండటంతో తట్టుకోలేక ఓ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడం మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జాజిరెడ్డి గూడెం మండలానికి చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. తనతోపాటు చదువుకున్న వంశీ అనే యువకుడితోసన్నిహితంగా ఉండేది. కాగా.. ఇటీవల సదరు యువతికి పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయం కాస్త వంశీకి తెలిసింది. దీంతో.. తననే పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.

గతంలో తామిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలను నీకు కాబోయే భర్తకు పంపిస్తానంటూ బెదిరించాడు. అయితే.. అతని మాటలను యువతి పెద్దగా పట్టించుకోలేదు. దీంతో.. వంశీ అనుకున్న పని చేశాడు. యువతికి కాబోయే భర్తకు ఆ ఫోటోలు పంపించాడు. దీంతో.. పెళ్లి కాస్త రద్దయ్యింది. ఆ తర్వాత ఆ ఫోటోలను యువతి స్నేహితులకు కూడా పంపడం మొదలుపెట్టాడు.

దీంతో.. అవమానంగా భావించిన యువతి తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు గుర్తించే సమయానికి చనిపోయి కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.