స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకున్న డబుల్ బెడ్రూం ఇళ్ళు తిరిగి లాక్కుంటామని కొందరు నాయకులు బెదిరించడంతో మనస్తాపానికి గురయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం సీఎం ఫాంహౌస్ గల ఎర్రవల్లిలో చోటుచేసుకుంది. 

గజ్వేల్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఫాంహౌస్ కు కూతవేటు దూరంలోని ఎర్రవల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో ఆనందంగా జీవించాలని వారి సొంతింటికలను నిజంచేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవచూపి తన ఫాంహౌస్ గల ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇప్పటికే లబ్దిదారులకు అప్పగించారు. ఇలా ఇచ్చిన ఇంటిని తిరిగి లాక్కుంటామని బెదిరించడంతో భయపడిపోయిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుంట నర్సమ్మ(45) కు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించిఇచ్చింది. అదే ఇంట్లో ఆమె కుటుంబంతో కలిసి నివాసముంటోంది. సొంతింటి కల నెరవేరిందని ఆమె ఎంతో సంతోషించింది. 

అయితే ఇటీవల ఇంటి ఆవరణలో వున్న ఖాళీస్థలం చూట్టూ ప్రహారీ నిర్మించాలని నర్సమ్మ భావించింది. ప్రహారి నిర్మాణపనులు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆమెపై బెదిరింపులకు దిగారు. ప్రహారీ నిర్మాణం చేపడితే ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా లేకుండా చేస్తామని... తిరిగి వెనక్కి లాక్కునేలా చేస్తామని బెదింరించారు. అంతేకాదు నర్సమ్మను చాలా అసభ్యంగా దూషించారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. 

నిజంగానే తన ఇంటిని ఎక్కడ లాక్కుంటారోనని భయపడిపోయిన నర్సమ్మ దారుణానికి పాల్పడింది. డబుల్ బెడ్రూం ఇంటి గురించే ఆలోచిస్తూ తీవ్ర డిప్రెషన్ కు లోనయిన మహిళ పంటకు కొట్టడానికి దాచివుంచిన పురుగుల మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురయిన నర్సమ్మను కుటుంబసభ్యులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయినా ఆమె ప్రాణం దక్కలేదు. హాస్పిటల్ కు వచ్చేలోపే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గూడులేని నిరుపేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు లభించినా స్థానిక నాయకుల బెదిరింపులతో మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ఎర్రవల్లిలో విషాదాన్ని నింపింది.