అప్పుడు సమయం దాదాపు రాత్రి 10.30గంటలు అవుతోంది.  ఓ యువతి ఒంటరిగా నిలుచోని.. ఫోన్ లో క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో ఓ అగంతకుడు అటువైపుగా పరిగెత్తుకుంటూ వచ్చి.. యువతి చేతిలోని ఫోన్ ని లాగేసుకోని వెళ్లిపోయాడు. మామూలుగా అయితే.. దాదాపు ఏ అమ్మాయి అయినా ఫోన్ పోయిందని ఏడుస్తూ కూర్చుంటుంది.. లేదంటూ.. ఏకేదైనా ప్రత్యామ్నాయం కోసం వెతికేది. 

కానీ.. ఇక్కడ ఈ యువతి మాత్రం అలా ఊరుకోలేదు.  ఆ అగంతకుడిని అరకిలోమీటరు పాటు వెంటాడి వాడి దగ్గర ఉన్న తన ఫోన్ ని తాను దక్కించుకుంది. అంతేకాదు.. నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భూమిక విమల్(29) బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ డిజైనర్ స్టోర్ లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె 10.30 గంటల ప్రాంతంలో మెట్రో ఎక్కేందుకు యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్దకు వచ్చారు. అయితే.. అప్పటికే మెట్రో చివరి సర్వీస్ పూర్తయ్యింది. దీంతో.. ఆమె స్టేషన్ కింద నిలబడి క్యాబ్ కోసం ప్రయత్నిస్తోంది.

సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమె చేతిలోని సెల్ ఫోన్ లాక్కొని  పరిగెత్తాడు. ఊహించని ఘటనకు షాకైన యువతి వెంటనే తేరుకొని నిందితుడిని పట్టుకునేందుకు పరుగెత్తడం మొదలుపెట్టింది. వాడిని పట్టుకునేందుకు మధ్యలో బైకర్ సహాయం తీసుకుంది. తర్వాత స్థానికుల సహాయంతో నిందితుడిని పట్టుకుంది. అతని దగ్గర నుంచి తన ఫోన్ ని తీసేసుకుంది. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించింది.

నిందితుడు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ నవీన్ నాయక్(20) గా పోలీసులు గుర్తించారు. భూమిక ధైర్యసాహసాలను జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి అభినందించారు.