వయసు మళ్లిన అత్త కి సేవలు చేసుకోవాల్సింది పోయి... ఆమె పై పగ పెంచుకుంది. ఆమె ఆస్తి పై కన్నేసి ఎలాగైనా దానిని దక్కించుకోవాలని అనుకుంది. ఆమె కుట్రలకు కొడుకులు కూడా తోడయ్యారు. కోడలు, మనవళ్లు తన ఆస్తి కోసం తననే చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆ ముసలి ప్రాణం గుర్తించలేకపోయింది. దీంతో.. నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎల్వర్తి గ్రామంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ల్వర్తికి చెందిన గాడ్ల కంసమ్మ (70)కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సత్యానారాయణ, కోడలు విజయ ఉన్నారు. సత్యనారాయణ-విజయ దంపతులకు 15, 12 ఏళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలున్నారు. సత్యనారాయణ మూడేళ్ల క్రితం మృతి చెందాడు. కంసమ్మ అప్పటికే తనకున్న ఎనిమిదెకరాల భూమిలో మూడెకరాలను కొడుక పేర చేసింది. మిగిలిన ఐదెకరాల్లో  ఇటీవల ముగ్గురు కూతుళ్లకు తలా ఎకరం పది గుంటల చొప్పున ఇచ్చింది. 

మిగిలిన ఎకరా పది గుంటల భూమిని తన పేరు మీదే ఉంచుకుంది. అయితే ఈ భూమిని కంసమ్మ ఎక్కడ కూతుళ్లకు రాసిస్తుందేమోనని కొన్నాళ్లుగా విజయ ఆందోళన చెందింది. ఆ ఎకరా పది గుంటలను తన పేరిట చేయాలంటూ అత్తపై ఒత్తిడి చేస్తోంది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా కోడలు పేరిట భూమి రాసేందుకు కంసమ్మ ఒప్పుకోలేదు. 

దీంతో కక్ష పెంచుకున్న విజయ,  అత్తను చంపాలని నిర్ణయించింది. తన పిల్లలతో బయట నుంచి ఐదు లీటర్ల పెట్రోలు తెప్పించింది. దాన్ని ఇంట్లో నిద్రిస్తున్న కంంసమ్మపై పోసి నిప్పంటించింది. మంటల్లో కంసమ్మ పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది.

కాగా.. నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.