ఓ ప్రైవేట్ స్కూల్లో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. మధ్య వయస్కురాలైన మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఈ సంఘటన అంబర్ పేటలోని గోల్నాక అశోక్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అంబర్ పేటలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి కుళ్లిపోయిన వాసన వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ కంపు భరించలేక వెంటనే స్కూల్ యజమానికి సమాచారం అందించారు. ఆయన వచ్చి స్కూల్ లాక్ ఓపెన్ చేసి చూడగా మహిళ మృతదేహం కనిపించింది.

కాగా.. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. కాగా... మహిళ వయసు 40 పైగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అప్పటికే ఆమె చనిపోయి మూడు, నాలుగు రోజులు కావొస్తోందని తెలిపారు. అయితే.. ఆమె ఎవరూ అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

లాక్ డౌన్ కారణంగా మూడు నెలల క్రితమే స్కూల్ కి లాక్ వేయగా.. తాళం వేసిన స్కూల్లోకి ఆమె ఎలా వచ్చిందనే విషయం తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. స్కూల్ పరిసరాల్లోని సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.