కల్పన అనే ఓ గిరిజన మహిళ స్పూర్తితోనే సీఎం కేసీఆర్.. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారు.  కాగా.. ఇప్పుడు ఆ కల్పన కూతురి వివాహం కళ్యాణ లక్ష్మీ పథకం కింద జరుగుతుండటం గమనార్హం. 

పేదింటి ఆడపిల్లలకు.. వారి పెళ్లి భారం కాకూడదు అనే ఉద్దేశంతో.. తెలంగాణ ప్రభుత్వం... కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు అందజేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే.. సీఎం కేసీఆర్ కి.. ఈ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందో ఎవరికైనా తెలుసా..? సీఎం కేసీఆర్ కి ఈ విషయంలో స్ఫూర్తి కలిగించింది ఎవరో తెలుసా? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కల్పన అనే ఓ గిరిజన మహిళ స్పూర్తితోనే సీఎం కేసీఆర్.. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారు. కాగా.. ఇప్పుడు ఆ కల్పన కూతురి వివాహం కళ్యాణ లక్ష్మీ పథకం కింద జరుగుతుండటం గమనార్హం. అసలు.. కల్పన.. ఈ పథకానికి ఎలా స్పూర్తిగా నిలిచిందో తెలుసా..?

సరిగ్గా 20 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని ఏర్పాటు చేసిన తర్వాత చంద్రశేఖర్ రావు 2002 ఏప్రిల్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో మల్లంపల్లి గ్రామ సమీపంలోని భాగ్య తండాలో భారీ అగ్నిప్రమాదం జరిగి 64 ఇళ్లు దగ్ధమయ్యాయి. బాధితులను ఓదార్చేందుకు కేసీఆర్ తండాకు చేరుకున్నారు. తమ కుమార్తె కల్పన పెళ్లి కోసం తాము కొనుగోలు చేసిన బట్టలు, బంగారం, వెండి వస్తువులతో సహా అగ్నిప్రమాదంలో అన్నీ కోల్పోయామంటూ ఓ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

వారి పరిస్థితిని చూసి చలించిపోయిన కేసీఆర్ కొద్ది రోజుల తర్వాత జరగాల్సిన పెళ్లికి ఏర్పాట్లు చేశారు, అదే సమయంలో కల్పన పెళ్లికి ఆమె తండ్రి కిమా నాయక్‌కు ₹ 50,000 ఆర్థిక సహాయం అందించారు. దీంతో నాయక్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే పేదలు తమ కూతుళ్ల పెళ్లిళ్లు చేయడంలో పడుతున్న ఇబ్బందుల గురించి చంద్రశేఖర్ రావు ఆలోచనలో పడ్డారు.

అదే కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ సంక్షేమ పథకాల అమలుకు దారితీసింది. ఇది SC, ST, BC మైనారిటీ కుటుంబాలకు చెందిన నూతన వధువుకు ₹ 1,00,116 ఆర్థిక సహాయం అందించడమే కాదు. ఇది బాల్య వివాహాలను నిరోధించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది వివాహానికి కనీస వయస్సు 18 సంవత్సరాలుగా నిర్దేశిస్తుంది.

కాగా.. కేసీఆర్ సహాయంతో .. కల్పనకు భాగ్య తండాకు చెందిన యాకూబ్ తో కల్పన వివాహం జరిగింది. వారు నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం మూడుచుక్కలపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కల్పన తన కుమారుడికి చంద్రశేఖర్‌రావు, కుమార్తెకు చంద్రకళ అని పేరు పెట్టారు.

గురువారం చంద్రకళ వివాహాన్ని కల్పన జరిపించారు. మూడుచుక్కలపల్లి గ్రామంలోని కల్యాణ వేదిక వద్ద కల్యాణలక్ష్మి చెక్కును అందజేసిన అధికారులు వివాహానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం చంద్రశేఖర్‌రావు తనకు సహకరించారన్నారు. ఈరోజు వర్ధన్నపేట మండలం దుబ్బ తండాకు చెందిన బానోతు చందర్‌తో వివాహమైన నా కుమార్తెకు ముఖ్యమంత్రి సహాయ సహకారాలు అందించారని ఆమె ఆనందంతో చెప్పడం విశేషం. గడిచిన ఎనిమిదేళ్లలో 10 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందాయి.