సీరియల్స్‌లో ఛాన్సులు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి పలువురిని నిండా ముంచిన మాయలేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా చింతపర్తికి చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుష్మిత సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేసింది.

తొలుత మ్యాట్రిమోని సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకుని.. పెళ్లికి సిద్ధమంటూ యువకులను నమ్మించి వారి నుంచి డబ్బు గుంజేది. దీనిపై పలువురు ఫిర్యాదు చేయడంతో 2017లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

జైలుకెళ్లొచ్చినా ఆమె బుద్ధి మారలేదు. ఈసారి ఏఖంగా ప్రముఖ టీవీ ఛానెల్‌కు ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా అవతారమెత్తింది. 2018లో తుమ్మల శ్రీదేవి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఈటీవీ తెలుగు అనే పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచింది.

అదే ఏడాది వంశీ అనే యువకుడు అవకాశాల కోసం శ్రీలతను సంప్రదించడంతో రూ. 50 వేలు తన ఖాతాలో వేయించుకుంది. అయితే శ్రీదేవి తుమ్మల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను గుర్తించిన ఈటీవీ చీఫ్ మేనేజర్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు శ్రీలతను గుర్తించి.. శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మణికొండకు చెందిన కాంతి అనే యువకుడి నుంచి రూ.6 లక్షలు వసూలు చేసినట్లు మరో నేరం బయటపడింది.