ప్రియుడి కోసం ఓ యువతి మాష్టర్ ప్లాన్ వేసింది. సొంత అక్క ఇంటికే కన్నం వేసి.. ప్రియుడిని ఆర్థికంగా నిలబెట్టాలని అనుకుంది. చివరకు వారి ప్లాన్ బెడిసిగొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన రామాంతపూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  రామాంతాపూర్ కి చెందిన ఝాన్సీ(20) తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఆమెకు ఒక సోదరి ఉండగా... వివాహం జరిగింది. కాగా ఝాన్సీ గత కొంతకాలంగా రాహుల్(21) అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. అతను బంజారాహిల్స్ లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.  కాగా..  వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. 

ఇటీవల రాహుల్ కి బాగా డబ్బు అవసరం పడింది. ఈ విషయాన్ని తన ప్రేయసి ఝాన్సీ ముందు ఉంచాడు. దీంతో తన ప్రియుడి అవసరం ఎలాగైనా తీర్చాలని అనుకుంది.  అతని అవసరం తీర్చడానికి పథకం వేసి మరీ.. ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌లో ఉంటున్న తన అక్క ఇంటికి ఝాన్సీ వెళ్లింది. ఆమె ఇంట్లో లేని సమయంలో బంగారు నగలు అపహరించి రాహుల్‌కు అందజేసింది.

అతడు తన స్నేహితుడు నిఖిల్‌(21)తో కలిసి వాటిని విక్రయించి తన అవసరాలు తీర్చుకున్నాడు. బంగారం పోయిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఝాన్సీని అనుమానించి ఆమెను విచారించగా నేరాన్ని అంగీకరించింది. రాహుల్‌, నిఖిల్‌, ఝాన్సీని మంగళవారం అదుపులోకి తీసుకొని నాలుగు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.