చుట్టం చూపుగా కుటుంబంతో సహా అత్తారింటికి వచ్చాడు. బంధువులందరితోనూ  సరదాగా గడపాలని అనుకున్నాడు. కానీ.. వరద రూపంలో వారిని దురదృష్టం వెంటాడింది. అతని కళ్ల ముందే భార్య, బిడ్డలు వరదల్లో కొట్టుకుపోయారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జడ్చర్ల ప్రాంతానికి చెందిన మహ్మద్ సాదిక్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.అతడి భార్య కరీమా బేగం స్వస్థలం గగన్ పహాడ్. కాగా.. వీరికి అయాన్(7), అమేర్(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సాదిక్ గత ఆదివారం గగన్‌పహాడ్‌ వచ్చాడు. అక్కడ కరీమా తల్లి అప్జల్‌బేగం పనిచేస్తున్న సెలబ్రిటీ గార్డెన్‌లో ఒకరోజు ఉండి జడ్చర్లకు తిరిగి వెళ్లాలనుకున్నారు. అయితే వర్షం కారణంగా వారి ప్రయాణం రద్దైంది. 

ఈ క్రమంలో మంగళవారం రాత్రి సెలెబ్రెటి గార్డెన్‌ వెనుకాల గల గదిలోనే తన భార్యాపిల్లలు, బావమరిది అమీర్‌ ఖాన్‌తో కలిసి పడుకున్నాడు. అర్ధరాత్రి వర్షం పడుతుండటంతో సాదిక్‌ బయట పడుకున్న తన అత్తను నిద్రలేపి దూరంగా ఉన్న బండపైన వదిలివచ్చాడు. అతడు వచ్చేసరికి అప్పచెరువు నుంచి వచ్చిన వరద ప్రవాహంలో  భార్యపిల్లలు, బావమరిది చిక్కుకున్నారు. కూతురిని కాపాడేందుకు ఇంట్లోని ఫ్రిజ్‌పైకి సాదిక్‌ ఎక్కాడు. ఈలోపే అతడి భార్య, బావమరిది, పిల్లలు కొట్టుకుపోయారు. మరుసటి రోజు ఉదయం కరీమా, చిన్న కుమారుడు అమేర్‌, బావ మరిది అమీర్‌ఖాన్‌ మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఆయాన్‌ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అధికారులు ఇంత వరకు కొడుకు జాడ చెప్పలేకపోయారని, కనీసం వెతకడం లేదని ఆరోపిస్తున్నాడు.