హైదరాబాద్: రూ1.10 కోట్ల లంచం తీసుకుంటూ తమకు చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో ఆధారాలు దొరికితే ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని తెలంగాణ ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. ఈ కేసులో నాగరాజు సహా రియల్టర్లు శ్రీనాథ్, అంజిరెడ్డి, వీఆర్ఎ సాయిరాజులను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. 

గురువారం వారి కస్టడీ ముగిసిన తర్వాత సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విచారణలో నిందితులు నోరు విప్పలేదని ఆయన చెప్పారు. లాకర్ల విషయంలో నాగరాజు, ఆయన భార్య తమను పలుమార్లు తప్పు దోవ పట్టించినట్లు ఆయన తెలిపారు. లాకర్లపై స్పష్టత రాలేదని చెప్పారు. 

దాడుల సమయంలో తమకు చిక్కిన రూ.1.10 కోట్ల నగదును వరంగల్ నుంచి తెచ్చినట్లు శ్రీనాథ్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్లపై కూడా విచారణ జరిపినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన విచారమలో రేవంత్ రెడ్డి ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభించలేదని, ఒక వేళ పాత్ర ఉన్నట్లు తేలితే రేవంత్ రెడ్డిని విచారిస్తారమని చెప్పారు. 

ఏసీబీ కస్టడీ ముగిసిన తర్వాత నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు ఆ తర్వాత ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుల బెయిల్ పిటిషన్ మీద శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది.