ఏ భార్య అయినా... తన భర్త వందేళ్లు బతకాలని కోరుకుంటుంది. తాను సుమంగళిగా కన్ను మూయాలని ఆశపడుతుంది. తన కళ్లతో భర్త చావును చూడాలని కూడా కోరుకోదు. కానీ ఓ ఇల్లాలు మాత్రం... భర్త చావకముందే తన చేతలతో చంపేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను తీసుకువెళ్లి స్మశానంలో పడేసింది. 

ఆయన్ను ప్రాణం ఉండగానే ఓ చెత్త రిక్షాల్లో లాక్కెళ్లి శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయింది. అక్కడ మూడు రోజులుగా అన్నం, నీళ్లు లేక.. ఒళ్లంతా ఈగలు, దోమలు ముసురుతూ ఆయన చావు కోసం ఎదురుచూస్తున్నాడు.

ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో చోటచుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... శంకర్ పల్లి మండలం ఎల్వర్తికి చెందిన కంటి సత్యయ్య(56) కు భార్య యాదమ్మ, కుమార్తె సంతోష ఉన్నారు. 8 సంవత్సరాల క్రితం కొడుకు మహేష్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు.

తనకున్న మూడెకరాలను సాగుచేసుకుంటూ కుటుంబాన్ని సత్యయ్య పోషించుకునేవాడు. 2005లో భర్తతో భూమిని అమ్మివేయించిన యాదమ్మ ఆ డబ్బునంతా తీసుకొని కూతురుతో కలిసి చేవెళ్ల వెళ్లిపోయింది. తర్వాత ఇల్లు కూడా పోవడంతో సత్యయ్య గ్రామంలోని డ్వాక్రా భవనంలోనే ఉంటున్నాడు. కొన్నాళ్లుగా సత్యయ్య ఆరోగ్యం విషమించింది. దీంతో భార్య యాదమ్మకు గ్రామస్థులు సమాచారమిచ్చారు.

 తానొచ్చి చేసేది ఏమీ లేదని తొలుత తేతల్చి చెప్పింది. తర్వాత మనసు మార్చుకొని అక్కడికి వచ్చిన  ఆమె.. భర్తను తన వెంట తీసుకొని వెళ్తుందని అందరూ భావించారు. అయితే... ఆమె దారుణంగా ప్రవర్తించింది. చెత్త సేకరించే రిక్షాలో భర్తను తీసుకెళ్లి వైకుంఠధామంలో వదిలి వెళ్లిపోయింది. నోట మాట రాక పడివున్న ఆయన్ను చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ పరిస్థితిలో ఉన్న మనిషిని ఎలా ఇలా వదిలేసి వెళ్లిందని పలువురు ఆమెను నిందిస్తున్నారు. కనీసం కూతురికి కూడా తండ్రి పైన ప్రేమ లేదా అని పలువరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా..చావు బతుకుల్లో ఉన్న సత్యయ్య  పరిస్థితిని చూసి అందరు కంటతడి పెడుతుండటం గమనార్హం.