తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన భర్తను కిరాయి హంతకుడికి సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఈ ఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు-నాగమణి భార్యా భర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఇతడు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్స్ లో స్టాళ్లను ఏర్పాటుచేసుకుని వస్తువులను విక్రయిస్తుంటాడు. దీంతో భార్యా, పిల్లతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. 

ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు చెందిన కన్నా అనే వ్యక్తితో నాగమణికి పరిచయం పెరిగింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే భార్య ప్రవర్తనలో మార్పు అనుమానం వచ్చిన నాగేశ్వరరావు ఆమెపై ఓ కన్నేసి వుంచగా అక్రమసంబంధం గురించి బయటపడింది. 

దీంతో అతడు భార్యతో పాటు ఆమె ప్రియుడు కన్నా తీవ్రంగా హెచ్చరించాడు. అంతేకాకుండా ఆమెను తరచూ ఈ విషయం కారణంగా వేధించేవాడు. దీంతో నాగమణికి దారుణమైన ఆలోచన వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని పథక రచన చేసింది. 

ఓ కిరాయి హంతకుడిలో నాగమణి ఆము ప్రియుడు కలిసి నాగేశ్వరరావు హత్య కోసం 50వేలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 1వ తేధీన మద్యం మత్తులో వున్న నాగేశ్వరరావుపై కిరాయి హంతకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. 

అయితే ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృతుడి భార్యపైనే అనుమానం వచ్చింది. దీంతో ఆమెను విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియుడు, కిరాయి హంతకుడిని అరెస్ట్ చేశారు.