ప్రతి రోజు వేధింపులు భరించి, భరించి ఇక ఓపిక నశించడంతో భర్తను చంపిందో భార్య. వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా ఎలుకపల్లిగేటు వద్ద నివాసం ఉండే సయ్యద్ ఖలీంకు చందపల్లికి చెందిన ఆస్రాబేగంతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది.

కొన్నాళ్లు రామగుండంలోని ఆర్ఎఫ్‌సీఎల్‌లో ఒప్పంద కార్మికుడిగా పనిచేసిన ఖలీం ఉద్యోగం మానేసి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మద్యానికి బానిసైన అతను నిత్యం తాగొచ్చి కొడుతుండటంతో ఏడాదిన్నర క్రితం ఆమె తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చింది.

అయినప్పటికీ ఖలీం తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. భార్యతో పాటు అత్తమామలపై దాడులకు పాల్పడుతుండటంతో ఆమె కుటుంబసభ్యుల్లో పూర్తిగా సహనం నశించింది. ఆదివారం రాత్రి కూడా తాగొచ్చిన ఖలీం అత్తగారింట్లోనే పడుకున్నాడు.

ఈ సమయంలో అతని భార్య, అత్తమామలు, సోదరులు కర్రలు, బండరాళ్లతో బాదడంతో ఖలీం అక్కడికక్కడే మరణించాడు. హత్యానంతరం వీరంతా పారిపోవడంతో పాటు వీరి ఇళ్లు ఊరి చివరన ఉండటంతో విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఖలీం తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆస్రాబేగంతో పాటు ఆమె కుటుంబసభ్యులను అరెస్ట్ చేశారు.