హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుడన్న జాలీ, దయ లేకుండా ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా హతమార్చింది. ఇలాంటి  దారుణాలను అడ్డుకోవాల్సిన ఓ పోలీసే ఈ హత్యలో మహిళకు సహకరించాడు. ఇలా భార్యా, పోలీస్ కలిసి దివ్యాంగుడిని పొట్టనపెట్టుకున్న విషాద సంఘటన అంబర్ పేటలో చోటుచేసుకుంది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంబర్ పేటలో నివాసముండే దివ్యాంగుడు చంద్రశేఖర్ గతకొద్ది రోజులగా కనిపించడం లేదు. దీంతో అనుమానం వచ్చిన అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చంద్రశేఖర్ భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో... ఆమెను విచారించగా ఈ అమానుషం గురించి  బయటపడింది. 

దివ్యాంగుడైన భర్త చంద్రశేఖర్ ను భార్యే హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు అందుకు ఓ హోంగార్డు ఆమెకు సహకరించినట్లు గుర్తించారు. చంద్రశేఖర్ ను దారుణంగా హత్య చేసి అతడి మృతదేహాన్ని నగర శివారులోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పూడ్చి పెట్టారు. 

దీంతో పోలీసులు చంద్రశేఖర్ భార్యతో పాటు హోంగార్డును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసుకుని అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం పోలీసులు సమిష్టిగా దర్యాప్తు చేస్తున్నారు.