వరంగల్: అందరూ చూస్తుండగా ఓ మహిళ తన భర్తను చితకబాదింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో చోటు చేసుకుంది. మరో మహిళతో సహజీవనం చేస్తూ తనను వదిలించుకోవడానికి చూస్తున్న భర్తకు బుద్ధి చెప్పింది. బ్యాంకులో పనిచేస్తున్న అతడిని అందరూ చూస్తుండగానే చొక్కా పట్టుకుని చితకబాదింది. 

ఆ సంఘటన మంగళవారంనాడు జరిగింది. వరంగల్ కు చెందిన శ్రీనివాస్ పోచమ్మ మైదాన్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప ఉంది. ఈ తరుణంలో మరో మహిళతో అతను సంబంధం పెట్టుకున్నాడు. దాంతో భార్యను పట్టించుకోవడం మానేశాడు. 

మరో మహిళతో సహజీవనం చేస్తున్న శ్రీనివాస్ ఇంటికి రావడం తగ్గించాడు. దీంతో భార్యకు అనుమానం వచ్చింది. అతను పనిచేస్తున్న బ్యాంకుకు వెళ్లి నిలదీసింది. మరో మహిళతో కలిసి ఉంటూ నాకు అన్యాయం చేస్తున్నావంటూ అందరూ చూస్తుండగానే చొక్కా పట్టుకుని చితకబాదింది. 

ఆ అనూహ్యమైన ఘటనతో దిగ్భ్రాంతికి గురైన బ్యాంక్ సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, వారి మాట వినకుండా మరోసారి భర్తను ఎడాపెడా వాయించింది. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది.