కొత్తగూడెం: పిల్లలు పుట్టలేదనె నెపంతో  మరో మహిళతో సహ జీవనం చేస్తున్న ఓ వ్యక్తిపై భార్య దాడికి పాల్పడిన ఘటన  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకొంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామంలో సాంబశివరావుకు ఐదేళ్ల క్రితం శైలజ అనే యువతితో వివాహమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. తనను భర్త చిత్రహింసలకు గురి చేసేవాడని  బాధితురాలు ఆరోపిస్తోంది.  అయితే బలవంతంగా బాధితురాలిని పుట్టింటికి పంపినట్టుగా శైలజ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల కాలంలో సాంబశివరావు తనకు దూరపు బంధువైన మరదలుతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఆమెతో కలిసి అదే గ్రామంలో మరో చోటు కాపురం పెట్టాడు.  ఈ విషయం తెలిసిన  శైలజ తన బంధువులతో కలిసి శుక్రవారం నాడు సాంబశివరావు ఇంటికి వచ్చి గొడవకు దిగింది.

భర్తను ఇష్టారీతిలో కొట్టింది. తనను చిత్రహింసలు పెట్టి పుట్టింటికి పంపి మరో మహిళతో ఎలా ఉంటావని ఆమె నిలదీసింది. శైలజ బంధువులు కూడ ఆమెకు మద్దతుగా నిలిచారు.