హైదరాబాద్: ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త సంఘటన చోటుచేసుకుంది. తమకు స్థానిక పోలీస్ అధికారి అన్యాయం చేస్తున్నాడంటూ శామీర్ పేటకు చెందిన ఓ రైతు భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శామీర్ పేట్ ఇన్స్పెక్టర్  సంతోష్ తమ భూమి వివాదంలో తలదూర్చి  అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ భిక్షపతి అనే రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. 

అయితే  ప్రగతి భవన్ వద్ద గల సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నిస్తున్న భార్యాభర్తలను అడ్డుకున్నారు. కిరోసిన్ పోసుకున్న భిక్షపతి పై నీళ్లు పోసి నిప్పంటుకోకుండా చేశారు. 

శామీర్ పెట్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బిక్షపతికి 1.30 గుంటల భూమి వివాదంలో వుంది. దీన్ని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని స్థానిక ఇన్స్పెక్టర్  చూస్తున్నాడని ఆరోపిస్తూ అతడు భార్య బిచ్చమ్మతో కలిసి ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు భిక్షపతితో పాటు అతడి భార్య బుచ్చమ్మ ను అదుపులోకి తీసుకున్నారు.