జాతీయ పార్టీని ఎందుకు పెట్టొద్దు: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్
జాతీయ పార్టీని తాము ఎందుకు పెట్టకూడదో చెప్పాలని తెలంగాణ సీఎం అడిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ కోరారు.
హైదరాబాద్: జాతీయ పార్టీ మేం ఎందుకు పెట్టకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జాతీయ పార్టీ మీరు పెడతారా అంటూ మాపై సెటైర్లు వేస్తున్నారు. జాతీయ లక్షణం మాకుందా మీకుందా అని కేసీఆర్ అడిగారు.ఇరుగు పొరుగును ప్రేమించే గొప్ప గుణం ఎవరికి ఉందో చెప్పాలని బీజేపీని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని సాగనంపుతామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. భారత రైతాంగానికి ఇచ్చినట్టుగానే దేశంలోని రైతులకు ఉచిత విద్యుత్ ను ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే దేశంలోని రైతుల్లో ఉద్యమం తీసుకువచ్చి బీజేపీ సర్కార్ ను సాగనంపుతామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు భారత రైతులకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
సింగరేణలో రూ. 4 వేలకు టన్ను బొగ్గు దొరుకుతుంటే 10 శాతం విధిగా విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలని మోడీ సర్కార్ చెబుతుందన్నారు. రూ. 4 వేలకు దొరికే బొగ్గును రూ. 3 0 వేలు పెట్టి కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. విదేశీ బొగ్గును కొనుగోలు చేయకపోతే ఎన్టీపీసీ నుండి విద్యుత్ ను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని కేంద్ర సర్కార్ పై కేసీఆర్ ఆరోపించారు.
also read:ఏపీ నుండి రూ.17,828 కోట్ల బకాయిలు,తప్పని నిరూపిస్తే రాజీనామా: కేసీఆర్
తెలంగాణ పోరాటల గడ్డ అని కేసీఆర్ చెప్పారు. బెదిరింపులకు ఎవరూ కూడా భయపడరని కేసీఆర్ తేల్చి చెప్పారు. మంత్రులు, సీఎం అనే తేడా లేకుండా ఎవరూ పడితే వారు విమర్శలు చేయడాన్ని కేసీఆర్ తప్పు బట్టారు. కర్ణాటక, మహరాష్ట్రల్లోని గ్రామాల ప్రజలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కావాలని కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుండి మహరాష్ట్ర రైతులు పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకొంటూ సేద్యం చేస్తున్న విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు. దేశాన్ని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో కేంద్రాన్ని విమర్శించే సందర్భం రాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.