జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నిస్తానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటించారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని చెప్పారు. అయితే కొద్ది రోజులుగా కేసీఆర్ సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన వ్యుహాత్మకంగానే మౌనం వహిస్తున్నారా..?, లేక ఆయన అనుకున్న దిశలో అడుగులు పడటం లేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నిస్తానని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటించారు. పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థి విషయంపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇటీవల ఢిల్లీ, పంజాబ్, కర్ణాటకలకు వెళ్లి పలు ప్రాంతీయ పార్టీ నేతలను కలిసిన కేసీఆర్.. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వద్దకు వెళతారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే అలా జరగలేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వత్యిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.. ప్రస్తుతం సైలెంట్ అవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బయటకు ఎలాంటి ప్రకటనలు చేయకుండా, పర్యటనలు లేకుండా.. ఆయన అంతర్గతంగా తన లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే ఈ ఏడాది జూలై 25తో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంంది. ఈలోపే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత కొంతకాలంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్.. కొద్ది రోజులుగా బహిరంగంగా ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. త్వరలోనే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న వేళ కేసీఆర్ ఇలా వ్యవహరించడంతో.. ఆయన వైఖరి ఏమిటనేది ఎవరికి అంతుపట్టడం లేదు. అయితే రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని కేసీఆర్ చెప్పడం వెనక అర్థం వేరే ఉందని.. ఇందుకు తగ్గట్టుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ విమర్శకులు మాత్రం.. ఆయనది అంతా హడావుడి చేయడం వరకేనని.. ఇకపై ఆయన చేసేది ఏమి ఉండబోదని కామెంట్ చేస్తున్నారు.
కేసీఆర్ వ్యుహాం అదేనా..
గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ పర్యటనలు గమనిస్తే.. ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాంచీకి వెళ్లి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ వెళ్లి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బెంగళూరు వెళ్లి జేడీఎస్ నేతలు దేవెగౌడ్, ఆయన తనయుడు కుమారస్వామిలతో సమావేశమయ్యారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరిపారు. తృణమూల్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌లతో కూడా కేసీఆర్ మాట్లాడారు.
అయితే చర్చలు అన్ని కూడా బీజేపీ వ్యతిరేక పోరుబాటను చర్చించేందుకు సాగినవే. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ప్రాంతీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల తరఫున అన్నా హజారే, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడల పేర్లను కేసీఆర్ ప్రస్తవిస్తున్నారని.. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు పేర్లపై కూడా చర్చ జరుగుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణమాలను దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ ప్రతిపాదనను దేవెగౌడ సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. అన్నా హజారే కూడా ఆ ప్రతిపాదనకు ఒకే చెబుతారా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
కేసీఆర్‌ను మిగిలిన పార్టీలు విశ్వసించేనా..?
అయితే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక కావాలని చెబుతున్న కేసీఆర్.. ఆ దిశగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్‌ను కొన్ని ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదు. కేసీఆర్ ప్రయత్నాలకు.. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతిచ్చే అవకాశాలు లేవు. అందుకు వైఎస్ జగన్‌కు కూడా రాజకీయ కారణాలు వేరుగా ఉన్నాయి. ఆయన కేంద్రంలోని బీజేపీతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ.. ఈ విషయంలో మాత్రం కేసీఆర్ ఆయనను పక్కన బెట్టారు.
మరోవైపు తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు.. కాంగ్రెస్‌తో మిత్రపక్షంగా ఉన్నాయి. ఇలాంటి పార్టీలు కాంగ్రెస్‌ను కాదని.. కేసీఆర్‌ను నమ్మి ఆయనతో చేతులు కలుపుతాయా అనేది కుదరకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మమతా బెనర్జీ.. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎత్తులను తట్టుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇతర రాష్ట్రాల్లో తృణమూల్ పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ దృష్టిలో ఆమె ప్రధాన మంత్రి అభ్యర్థి. బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా కూటమి ఏర్పడితే... తన సారథ్యంలోనే ఏర్పడాలి, తానే నేతృత్వం వహించాలన్నది ఆమె అంతర్గత ఆలోచనగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక్కడ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూడా తాను జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని భావిస్తున్నారు. తానే కూటమికి నాయకత్వం వహించాలనేది ఆయన భావన అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇలా భిన్న రాజకీయ లక్ష్యాలు, ప్రయోజనాలు, ఆలోచనలు ఉన్న పార్టీలు అన్ని కలిసి ఏకతాటిపైకి రావడం సాధ్యమేనా అని రాజకీయ విశ్లేషకుల సందేహం. ఒకవేళ వీరంతా కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలపెట్టినా.. కాంగ్రెస్ బయటి నంచి మద్దతిచ్చినా విజయం సాధించడం కష్టంగానే కనిపిస్తుంది.
ఎందుకంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు కోరేందుకు బీజేపీ.. వైసీపీ, బీజేడీలతో చర్చలు ప్రారంభించింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా ఎన్‌డీఏతో కలిసి వెళ్లేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఎన్‌డీఏకు ఆధిక్యత ఉండగా.. ఆ రెండు పార్టీ మద్దతు లభిస్తే ఈ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే కానుంది.
అలా జరగని పక్షంలో సైలెంటే..
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మొన్నటివరకు హడావుడి చేసిన కేసీఆర్.. సైలెంట్‌గా ఉండటంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బహిరంగంగా ఎలాంటి కామెంట్స్, పర్యటనలు చేయకపోయినప్పటికీ.. కేసీఆర్ అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారని టీఆర్ఎస్‌లోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలపడంలో విఫలమైతే.. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఎన్డీయేకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే సమస్యే లేదని ఆ వర్గాలు తెలిపాయి.
