హైదరాబాద్: టీడీపీలో వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలు లేవని శేరిలింగంపల్లి టీడీపీ నేత మువ్వ సత్యనారాయణ చెప్పారు.ఆదివారం నాడు  శేరిలింగంపల్లిలో జరిగిన ఘటనపై   మువ్వ సత్యనారాయణ వివరణ ఇచ్చారు.

మియాపూర్‌లోని టీడీపీ కార్యాలయంలో మువ్వా సత్యనారాయణ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలున్నారని చెప్పారు.  కానీ పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండానే భవ్య ఆనంద్ ప్రసాద్ తనకు టీడీపీ టిక్కెట్టు కేటాయించిందంటూ  రథాలు, పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు.

ఈ విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించినా భవ్య ఆనంద్ ప్రసాద్ సహకరించలేదన్నారు.  భవ్య ఆనంద్ ప్రసాద్ కోసం సీనియర్  పార్టీ కార్యకర్తలు నాలుగు గంటల పాటు ఎదురు చూశారని ఆయన చెప్పారు. కానీ,ఆయన రాకుండా వేరే వారిని పంపించారన్నారు.

అంతేకాదు  పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు మర్యాద ఇవ్వకుండా బండి పోనియండి అంటూ ప్రచార రథాన్ని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించడంతో
రాళ్లు, చెప్పులతో బెదిరించడంతోనే వివాదం చోటు చేసుకొందని చెప్పారు.  కానీ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కానీ, బేధాభిప్రాయాలు లేవన్నారు.

పార్టీ అధిష్టానం ఎవరికీ కూడ టికెట్టు ఇచ్చినా గెలిపించేందుకు  పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. భవ్య ఆనంద్ ప్రసాద్  కూడ పార్టీ కోసం పనిచేశారని చెప్పారు.  

కానీ ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు  నిర్వహించడంపై  ఈ ఘటన చోటుచేసుకొందన్నారు. పార్టీకి నష్టం వాటిల్లేలా ఎవరూ కూడ పనిచేయవద్దనిఆయన  పార్టీ కార్యకర్తలను కోరారు.

సంబంధిత వార్తలు

శేరిలింగంపల్లి లొల్లి: టీడీపీలో బాహాబాహీ, సైకిల్‌కు సీటొద్దంటున్న బిక్షపతి యాదవ్

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి